దేవుడికి లేఖ. 11/5/2013
రచన : బారువ కోమలరావు
శ్రీకాకుళం
-------------------------
మహరాజశ్రీదేవుడు గారికి ,
జీవుడు నమస్కరించి వ్రాయు విన్నపము
భూమి జనులు పెక్కు ఇక్కట్లు పడుచున్నారు.
తోటి ప్రజలను ఇక్కట్లు పెడుతున్నారు.
మానవత్వము మరిచి మృగాల వలె ప్రవర్తిస్తున్నారు.
ఇది యుగ ప్రభావమా? మనిషి రాక్షసత్వమా?లేక నీ లీలామనుష కృత్యమా?
డబ్బును ప్రేమించినంతగా మనిషి మనిషిని ప్రేమించలేటంలేదు.
డబ్బుకొరకు మానము ,అభిమానం అమ్ముకుంటున్నాము.
ఆదిలో నీ అనుగ్రహంకొరకు తపస్సు చేసేవాళ్ళము.
నేడు తప్పులు చేసి నీ అనుగ్రహం కోసం ముడుపులు కడుతున్నాము.
కర్మభూమియైన భరత వర్షంలో
దుష్కర్మలు భరత నాట్యం చేస్తున్నాయి.
వేదాలు వల్లించాల్సిన భూసురులు బూతులువల్లిస్తున్నారు.
రక్షణ కల్పించవలసిన క్షత్రియులు (పరిపాలకులు) ప్రజలను భక్షిస్తున్నారు.
వ్యాపారము చేసె వైశ్యులు కల్తీ విక్రయం చేస్తున్నారు.
సేవలు చేయాల్సిన శూద్రులు సేవలు చేయించుకుంటున్నారు.
వర్ణాలు రంగులు మారాయి.
ఆశ్రమాలు అశ్లీలాలైనాయి.
నీవు సృజించిన నీరు 'కొని' త్రాగుతున్నాము
నిషేధించిన మధువు త్రాగి తూలుతున్నాము.
కోట్లతో ఓట్లు కొని కోట్లకు పడగలెత్తుతున్నాము
ఓట్లు వేసిన వాడి నడుము విరుగ గొడుతున్నాము
రూక లేని వానికి రోగమొస్తె రోగముదే పైచేయి
డబ్బున్న వాడికి జబ్బొస్తే వాడిదేనోయ్ హాయి
వస్తువులధరలు వ్యోమనౌకలైనాయి.
సొమ్ములేమొ మరి చిల్లపెంకులైనాయి
ఋగ్యజుర్సామాధర్వణ వేదాలు నాలుగే నీకు
అతివాద,మతవాద,ఉగ్ర, వేర్పాటు వాదాలనేకం మాకు
ఏమిటి మా భవితవ్యం
చెప్పవోయి నీ ఆంతర్యం
"యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ః
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్"
అని చెప్పిన నీవు
నిన్ను నీవు సృష్టించుకుంటావా
మమ్మల్ని పుట్టించటం ఆపుతావా
ఏదో ఒకటి చేయ్
నీవున్నావని ఋజువుచేయ్
ఇట్లు
వరాహకల్ప
వైవస్వత మన్వంతర
జంబూద్వీప
భరత వర్ష
భరతఖండ
కలియుగ జీవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి