28, నవంబర్ 2019, గురువారం

చెట్టు - సిగరెట్టు 

కట్టె కాల్చగా వచ్చేది ధూమం
సిగరెట్టు కాల్చగా వచ్చేది ధూమం .         

కట్టె చచ్చిన వానిని కాల్చును.
సిగరెట్టు బ్రతికిన వానిని కాల్చును

కట్టెకు  సిగరెట్టు కు ఉనికి పట్టు చెట్లే 
తరచి తరచి చూడగా రెండును చెట్లే .

       వృక్షాలలో రాజు  'టేకుచెట్టు.
      రోగానికి కారణం 'పొగాకు చెట్టు

చెట్టు మనిషికి ఉన్నతిని చూపెట్టు.
సిగరెట్టు మనిషికి  పతనాన్ని  చూపెట్టు

చెట్టు  ఆమ్లజని  యిచ్చి మనిషిని బ్రతికిస్తుంది 
సిగరెట్టు బొగ్గు పులుసు నిచ్చి మనిషిని హింసిస్తుంది.

కట్టెలను కాల్చితే జరిగేది యజ్ఞము.
సిగరెట్టు కాల్చితే  వచ్చేది   యక్ష్మము.

కాబట్టి 

చెట్లను విరివిగా నాటండి.
సిగరెట్లను కాల్చడం మానండి.

డాకోమలరావు బారువ  18/11/2019

21, నవంబర్ 2019, గురువారం

సరదా గా........

మనిషి మనీ ( money) తత్త్వం .

ఉల్లి ధరలు పెరుగగానే 
లొల్లి చేయుదురు కొందరు .

మొబైలు ఎంత ధర ఉన్న 
మాట్లాడకుండ కొందురు

పప్పు రేటు పెరుగగానే 
స్టెప్పు(చిందులులేయు చుందురు

పబ్బులోన రేట్లు పెరుగ 
నో ట్రబుల్ యందురు .

ఆకు కూరలనగానే ఛీ పోయని అందురు
మేక కూర అనగానే గుటకలేస్తు తిందురు . 21/11/2019

కవిత - లక్షణాలు 

కవితంటే కాదు నల్లని అక్షరాలు 
కవితంటే కాదు    ఈలు 
కవితంటే కవి గుండె చప్పుల్లు 

కవితంటే కాదు కలంతో వ్రాయడం 
కవితంటే సమాజాన్ని చదవడం 

కవిత వేస్తుంది మార్పునకు పునాది 
కవిత చేస్తుంది రాక్షత్వాన్ని సమాది 

కవితకు కాదేదీ అనర్హము 
కవితకు చెడు అగును గర్హణము 


డాకోమలరావు బారువ ౨౨/౧౧/౨౦౧౯. 22/11/2019

18, నవంబర్ 2019, సోమవారం

 కవి

సూర్యుఁడు చూడని చోటెల్ల  చొప్పడి చూచు వాడు.
నిద్రాణమైన నరులఁ జాగృతమ్ము చేయు జే గంట వాడు.
సంఘమందున్న మూఢాచారాలఁ ఖండించు ఖడ్గమ్ము వాడు.
సీమను రక్షించు సైనికులకు తూటా వంటి ఉత్తేజమ్ము వాడు.

మండుతున్న రవి .చీకటిలో ఛవి.

కష్ట జీవి కుడి ఎడమల నుండు వాడు కవి 

అతడే కవి




మన కవులు .


వ్యాసుడు.


వ్యాసుడు 


.వె 


నాల్గు తలలు లేని నలినాసనుఁ డతఁడు 

రెండు భుజము లచ్యుతుండతండు /రెండు భుజములుగల శ్రీ ధరుండు 

అగ్గి కన్నులేని  అసమాంబకుడతఁడు 

వ్యాసుడై జగతిని వరలె నతఁడు 



తే.గీ 

పల్లె పడుచుకు పాపడై ప్రభవ మంది/
వేదములు నాల్గు వేర్వేర విశదపరచి /
భారత ఫల మందించిన బాదరాయ /
ణార్య చేకొను వేవేల నతులు మావి.

తే.గీ 

భావి కాలమునల్ప మతులు ప్రజలని మది/
తలఁచి భారతాఖ్యమఁ పటు కలము నొసఁగి /
పెక్కు బాముల తరియింప పెంపు మీర/
ప్రజల బ్రోచిన శుకతాత వ్యాస మౌని .


వాల్మీకి
ఆ.వె.
పుట్టలో న పుట్టె పుణ్యాత్ముడొక్కడు/
వామాలూరుడనఁగ వఱలు వాఁడు /
వాని నోటి నిండి వచ్చె రామచరిత్ర /
ధరణి జనుల ముక్తి దాయకంబు .



కాళిదాసు

ఆ.వె.

కవుల గణన చేయఁ గనిష్ట దాటని/
ఘనత కెక్కినట్టి కవివరుండు/
తివిరి ఉపమలెన్నొ తీపిగా కూర్చెడి/
ఘనుడు కాళిదాసు కాళిదాసు.

తే.గీ.

రమ్యమగు నాటకములెన్నొ రచన చేసి/
మేఘసందేశ , రఘు వంశ మేటి కావ్య/
మణులను జగతికిచ్చిన మాన్యు కాళి/
దాసు కాళికా దాసుని దండమిడుదు.


ఉపమా కాళిదాసస్య. భారవే అర్థ గౌరవః
దండినః పద లాలిత్యం మాఘే త్రయీ గుణాఁ


నన్నెచోడుడు.

తే.

దేశ కవితకు ఆద్యుఁడై నెగడు వాఁడు/
మార్గ కవితను రచనలో మరువకుండ /
క్రౌంచభేదను సంభవ కావ్య కర్త/
ఘనుఁడు నన్నెచోడకవిని వినుతి సేతు.

నన్నయ కవి

తే.

రాజ రాజయశము సుస్థిర మ్ము చేయ/
రమ్యముగ భారతమ్మును రచన చేసి/
ఆది కవియనఁ తెల్గున నలరు వాని/
నన్నయ కవిని మనసార నతులు సేతు.


తిక్కన కవి

తే.

మనుమ సిద్ధి యెవని మామ యనియెఁ బేర్మి /
భారతమెవని కలములో పరిడవిల్లె/
రామ కథ నెవడు రహిఁ నిర్వచన చేసె/
నట్టి తిక్క యజ్వను నెమ్మనమునఁ దలఁతు.


ఎఱ్ఱన కవి

తే.

రాణకెక్కఁగ హరివంశ రచన చేసి/
భారతారణ్య శేషము భక్తి వ్రాసి/
శంభు దాసు బిరుదు గొనె శంభుఁ గొలిచి/
ఎఱ్ఱనార్యుఁడు భువినెంత వినుత యశుఁడు.

శ్రీకృష్ణ దేవరాయలు.

తే.గీ
తుళువ వంశ కల్ప కుజమై కలన మెఱసి/ కన్నడ తెనుఁగు రాజ్యశిఖరపు భూష / ణ ,పర రాజ నిర్మథన ఘన భుజ వీర్యు/ కృష్ణ దేవ రాయ నృపుని కీర్తి మెత్తు.తే.గీ కలము చేపట్టి కృతికన్యకలసృ జించి/ కత్తి కేలూని సంగర కల్పన లను/ కృతి కదనములను ఘనుడు కృష్ణరాయ/ లనుచు రాయల సత్కీర్తు లనునుతింతు.

చేమకూర వేంకట కవి

తే.

మధుర నాయక రాజుల మన్ననంది /
అలఁతి పదముల మధుర కృతులన లరఁగ/
రచన చేసిన యట్టి సరస కవి మణి/
చేమకూర వేంకట కవి చిర యశుండు.

తే.

వైద్యుడైన గాని వర్ణింపగాలేని/
గర్భ లక్షణాలు గరువమొప్ప/
చేమకూర వారి చెన్ను మీఱేడు కైత/
రసిక జనులహృదయ రంజకమ్ము.


అయ్యలరాజు రామభద్రుడు.

తే.
రాయల భువన విజయాన రాణ కెక్కి/
రహిని రామాభ్యుదయ కృతి రచన చేసి/
నట్టి రామభద్ర సుకవిఁ నిట్టలముగ/
నామతింతును నామది నేమముగను


సూరన కవి

తే.

కావ్యమందొక యర్థము గనుట లెస్స/
పరఁగ రెండర్థముల కృతులరుదు గాదె/
రామభారతార్థయుతమ్ముగా మలచిన /
కవిని సూరనార్యు మదిని గణన సేతు.


నంది తిమ్మన

తే.

సత్య పుష్పముఁ గోఁరఁగాఁ శౌరి తెచ్చె/
పారిజాతమున్ మక్కువ మీఱ భువికి/
సరసులు భళీ యనఁగఁ రచనను చేసెఁ/
నరణపుఁ గవి తత్పుష్పాప హరణ కథను.


బద్దెన

పెద్దనవలె జిగి బిగియౌ/
పద్దియముల వ్రాయవలెను పండితులన్నన్/
బద్దెన వలె నీతిఁ దెలుపు /
పద్దియములు వ్రాయ వలెను పండితులైనన్.

తిరుపతి కవులు

తే.

అరయఁ నవధాన విద్యకుఁ నాది కవులు/
మీసలపయిఁ బందెమ్మేసె మేటి కవులు /
రాయబారాది నాటకాల్ రచన చేసి /
నట్టి జంట కవివరుల నామతింతు.

కొప్పరపు కవులు

క.
గొప్ప కవితలాశువుగా /
నొప్పగు నవధానకళల నొరవడి దిద్దన్/
కొప్పరపు కవులు చెప్పె నొ/
కప్పుడు రాజుల కొలువుల నాదరమొప్పన్.

జాషువా

తే.

ప్రథిత గుంటూరు సీమలో ప్రభవ మంది/
దళిత కులమందు వెలసిన తులసి వీవ/
 రహిని గబ్బిలం పిరదౌసి రచన చేసి/
 గణన కెక్కిన జాషువా ఘనుడ వీవు.

డా. బారువ కోమలరావు .11/11/2019
విద్య

విద్య అనగ చదువు

బిడ్డ పుట్టగానే ఉంగా ఉంగా యనును
అమ్మ నేర్పగా అమ్మా అమ్మా యనును.

తొలి విద్యకు నిలయం అమ్మ ఒడి
మలి విద్యకు నిలయం వీథి బడి

విద్య కాదు ఉద్యోగానికి వారధి
విద్య విజ్ఞాన సాధనకు సారథి

విద్య యనిన విషయాన్ని తెలిపేది
విద్య యనిన విజ్ఞాన మిచ్చేది.

విద్య మనిషికి నీటిలో కలము
విద్య మనిషికి చీకటిలో దీపము

విద్యకు లేవు భువిని ఎల్లలు
విద్యకు ప్రయోజనాలు కోకొల్లలు

విద్య మనిషికి విదేశాన బంధువగును.
విద్య మనిషికి ఆపదలో మంచి పొందగును.

విద్య మనిషికి యొసగును వినయము
విద్య మనిషికి తొడగని భూషణము

విద్య మనిషికి పూయని పరిమళం
విద్య మనిషికి ఒక దేవాలయం

రచన :- డా . బారువ కోమలరావు
శ్రీకాకుళం
17/11/2019



విద్య


ఆ.వె.

విద్యలరసి చూడ వివిధము లై యుండు/
లౌక్య విద్య మరియ లౌక్య విద్య /
ఒకటి గురువు నేర్పుఁనొకటి లోకము నేర్పు /
గురువు నేర్పు విద్య గొప్ప విద్య /

ఆ. వె

విద్య యిచ్చు నెపుడు విజ్ఞాన సంపదల్/
విద్య పెంచు మనకు వినయ గరిమ/
విద్య నేర్వ కల్గు వేవేల లాభాలు/
విద్య లేని నాడు విలువ లేదు.

ఆ.వె

సంపదెంత యున్న చదువు లేకున్న ను/
మనిషి బ్రతుకు సున్న మహిని చువ్వె/
విద్య తోడుగ మరి వినయమ్ము కలిగిన/
మనిషి బ్రతుకు భువిని 'మణి'కదన్న.


ఆ.వె

దొంగిలింప బడదు దొరలు కోరని నిధి/
అన్న దమ్ములెవ్వరడుగని సిరి/
పరుల తోడ నెంత పంతమ్ము నకు పోవ/  స్పర్థయా వర్థతే       విద్య
పెరుగు , విద్య కుర్వి తరుగు లేదు.


ఆ. వె.
విద్య గుప్త మైన విత్తమ్ము వంటిది/
దొంగిలించ లేడు దొంగ యెవడు/
అరయ చుట్టమగును పరదేశమందును/
విద్య కు సరి లేదు విశ్వ మందు.

రచన:- డా. బారువ కోమలరావు
శ్రీకాకుళం
17/11/2019