29, అక్టోబర్ 2022, శనివారం

 


నాగుల  చవితి సందర్భముగా మహాభారతము ఆది పర్వమునుండిఉదంకుడు చేసిన నాగుల స్తుతి .


.

బహువనపాదపాబ్ధి కులపర్వతపూర్ణ సరస్సరస్వతీ /

సహిత మహామహీభర మజస్రసహస్ర  ఫణాళిఁ దాల్చిదు/

స్సహతర మూర్తికిన్ జలధిశాయికిఁ బాయక,శయ్యయైన /

య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్


తా .

పెక్కు అడవులతో , చెట్లతో సముద్రాలతో ,కులపర్వతాలతో నీటితో నిండిన  సరస్సులతో , నదులతో కూడిన భూమియొక్కబరువును ఎల్లప్పుడు వేయిపడగల సముదాయముతో ధరించి మిక్కిలి సహింపశక్యము కాని విగ్రహము,గలనారాయణునికి విడువక తల్పముగాఉండి పాపాల అంతరింపజేసి అనంతుడనే పేరు గల  నాగరాజుమా పట్లఅనుగ్రహము,కలవాడు అగుగాక .


అరిది తపోవిభూతినమరారుల బాధలువొందకుండఁగా/

నురగుల నెల్లఁగాచిన మహోరగనాయకుఁడానమత్సురా/

సురమకుటాగ్రరత్న రుచిశోభిత పాదునకద్రినందనే/

శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్.. 


తా

చేయ శక్యముగాని తపస్సుయొక్కవైభవముచేత రాక్షసులు పెట్టే బాధలు పొందకుండగా నాగులనందరినిరక్షంచినగొప్పసర్పరాజును , వంగి నమస్కరించే దేవతలయొక్క రాక్షసులయొక్కయు కిరీటాలపై భాగాలనున్నమణులకాంతిచేత ప్రకాశించే పాదాలు కలపార్వతీపతియైన  శివుడికి అలంకారమైన వాసుకి,అనే సర్పరాజుమాయెడ అనుగ్రహము కలవాడు అగుగాక . 


దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్ విపులప్రతాపసం/

భావిత శక్తి శౌర్యులు నపార విషోత్కట కోపవిస్ఫుర /

త్పావకతాపితాఖిల విపక్షులు నైన మహాభావు లై/

రావతకోటి ఘోరఫణి రాజులు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్


తా

దేవతల  మనుష్యుల లోకాలలో తిరుగుతూ అధికమైన తేజస్సుచేత పూజింపబడిన సామర్థ్యము , పరాక్రమముకలవారును ,అనంత,విషముచేతమధికమైన కోపముతో ప్రకాశించే అగ్ని చేత తపింపజేయబడిన సర్వ శత్రువులుకలవారును అయిన మహాత్ములు ఐరావత నాగవంశములోని కోటి సంఖ్యాకులైన సర్పరాజులు మాపట్ల అనుగ్రహముకలవారు అగుదురుగాక



గోత్రమహామహీధర నికుంజములన్ విపినంబులం గురు/

క్షేత్రనం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుఁడై/

ధాత్రిఁ బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షుఁడీక్షణ/

శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్


తా

గొప్ప కులపర్వతాల పొదరిళ్ళలో అడవులలో కురుక్షేత్రములలో ఇచ్ఛవచ్చినట్లు సంచరించే క్రీడతో అలరి కుమారుడైనఅశ్వసేనుడితో కూడి భూమి మీఁద తిరుగుతూ బలములో గర్వములో శౌర్యములో సమర్థుడైన పరాక్రమవంతుడుపాములకు రాజు అయిన తక్షకుడు మాయెడ అనుగ్రహము కలవాడు అగుగాక

20, అక్టోబర్ 2022, గురువారం


సరదాగా ఒక పద్యము 


.వె .

మద్యమునకుఁ నింటి మగువకు సామ్యమే 

మని యొకకవి నడుగ ననియె నతఁడు 

'మద్యము మగువయు సమ సుఖమునిచ్చు రా /

త్రి , పగలు తల నొప్పి తెచ్చు సుమ్ము ' 


-కోమలరావు 


 

7, అక్టోబర్ 2022, శుక్రవారం

 


ఓనీటి చుక్కా పదవిని బట్టి  విలువ!

              

           : "స్థాన  విశేష మాత్రమున  'తామఱపాకున  నీటిబొట్ట'! నిన్


                 బూనిక  మౌక్తికంబనుచుఁ బోల్చినమాత్రన  నింత గర్వమా?


                 మానవతీ శిరోమణుల  మాలిక లం దునఁ గూర్ప వత్తువో?


                 కానుక లీయవత్తువొ వికాసము నిత్తువొ విల్వ నిత్తువో?


                  చాటుపద్యం-- నందితిమ్మన-- రాయల యాస్థాని!



ఓనీటి చుక్కాతామఱపాకుపై  నిలచి నేను  ముత్యాన్నని డాబులు కొట్టబోకుతెలియని వారు నిన్ను ముత్య

మనుకొనినంత మాత్రమున నీకంతగర్వమానీవేమైనా  ఆడవారి పూమాలలలో  నలంకరింప దగియున్నావాకానుకలిచ్చుటకు పనికివత్తువానీవల పరిసరములకేదైన వికాసము కలుగునాఅమ్ముకొందమనిన నీకేమైన  విలువయున్నదాగాలివాటుకు నీటిలోకిజారితివాఇకనీపనిశూన్యముఇంతదానికంత మిడిసిపడుటయేలమేలుగాదుసుమా?"-అని హెచ్చరిక!


 

హంపీ యాత్ర 


తే.

రాయలేలిన యలనాటి రాచ నగరు /

విద్యలకు నిలయమ్ము యే విజయ నగరు /

ఘంటములు కత్తు లేవీట కదను తొక్కె /

నదెపొ ఘనత కెక్కిన నాటి హంపి నగరు .



తే

కనుల వీక్షించు భాగ్యమ్ము కలుగలేదు /

చూచు మీరలు రహి హంపి సొగసు లన్ని /

యెఱుక పరచుడు వీనుల విందుగాగ /

పద్య సౌందర్య  పండిత వర్యులార .



-కోమలరావు. 7/10/2022 


6, అక్టోబర్ 2022, గురువారం

కృష్ణంరాజునకు శ్రద్ధాంజలి 🌹🌹🙏🏻🙏🏻


వె 

'రాజువెడలె నొక్క రసమయి జగతికి /

వాని యూసు లన్ని వదలి భువిని /

నటుని గానె కాదు నాయకుడై వెల్గె /

కృష్ణ రాజు యొక్క  కీర్తి మిగుల 


డాకోమలరావు 

 జెండాకు వందనము 


సత్యాగ్రహమ్మె స్వతంత్ర సాధనమ్మనియె నొకఁ డు .


స్వతంత్రమ్ము  నా జన్మ హక్కని గద్దించెనొకఁ డు


మాకొద్దు  తెల్లదొరతరమని ప్రతిఘటించెనొకఁ డు .


తెలుగు వీర లేవరాయని యెలుగెత్తెనొకఁ డు


తుపాకీ గుండుకు తన గుండె చూపెనొకఁ డు .


గుండు తోడనె స్వతంత్రమ్ము సిద్ధించు ననియె నొకఁ డు .


చెయ్యెత్తి జై కొట్టమని నినదించెదె నొకఁడు .


అందరి త్యాగ ఫలమ్మె

 మన స్వతంత్ర ఫలమ్ము 


  స్వతంత్ర ప్రతీక గా 

పింగళి సృష్టించె త్రివర్ణ పతాకమ్ము 


 వందనమ్ము చేయుడీ మువ్వన్నెల జెండాకు 

 అమృతోత్సవ స్వతంత్ర వత్సరమున 



జై హింద్ 

జై  భారత్ .


డాకోమలరావు బారువ




సత్య దీక్ష సాధనమని చాటె నొకఁడు /


'తెల్ల దొరతన మేలని '   తెగడె నొకడు / 


తెలుగు వీర లెమ్మనుచును తెల్పె నొకఁ డు./


గుండుకెదురుగా నొక్కడు గుండె చూపె/


ఎందరేమి చెప్పిన నేమి యందరొక్క 



మూడు రంగుల రెపరెప లాడ కనుల 

ముందు యాసంతస మ్మే మేమందు