17, జులై 2022, ఆదివారం

 


సతీ సావిత్రి 


ఎవరీ మూర్తి చూడగ నా పతిప్రాణములు గొని పోవవచ్చిన యమమూర్తి వలె నున్నాడే

ఆహా యేమి యాశ్చర్యము ! 

బహుకృత దాన ధర్మార్జిత పుణ్యసంపన్నులకుతప్ప యన్యులకగోచరమంబైన మద్రూప విశేషంబు యీ యన్నులమిన్నలకెట్లు కానుపించె

అయినను ప్రకాశముగా 

సావిత్రీమానిని 

అహాహా నిర్నిమిత్త సందేహ డోలాయ మానసవై యేల యట్లు దిగాలుగా చూతువు ?  


సామాన్య మనీషాగోచరంబైన మద్రూప విశేషము గాంచి నేనెవ్వరో యోచింపయుండజాలుదు .అయినను వచించెద 


సీ 

క్షీరాబ్ధి పై తేలు శ్రీ హరి పానుపు యొరిగినా యొకప్రక్కకొరుగుగాకా /

వేదాలు వల్లించు విశ్వ కర్త ముఖాలు నాలుగు మూడైన యగును గాక

పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందు తాళము  తప్పిన తప్పుగాక /

చదువుల గీర్వాణి మృదుకరాంచి వీణ పలికినా యపశృతుల్ పలుకుగాక //


గీ.

 సకల లోకాల ధర్మ శాసన మునమలు/

చేసి విధి వ్రాయు యాయువు చెల్లగానె /

వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి /

మోసుకొని పోవు చుండు యముండనబల .


సావిత్రీ యిదిగో నీ పతి  ప్రాణంబులు గొనిపోవుచున్నాడా


 నాథా నాథా 


. :- 


మహిష రాజమా మరలుము


సా:- 

పోవు చున్నావాతమ్ముడా యమధర్మరాజా

సుంతయేని తరుణ మాని సాత్వతి ప్రాణములను పోవుచున్నావా


అహా ఏమి  సాధ్వి లలామ సాహసము 


దుర్గమ కీకారణ్య ప్రయాసము   సైతముసైరించి నన్ననుసరించు యీమె స్థైర్యము సంస్తవనీయమైనను అహోనిష్ప్రయోజనమే !

కనుక చెప్పి చూచెదను గాక 



సీ


కాలు మోపిన చాలు కస్సని యరికాలు కోసుకు పోయెడి కూసురాళ్లు /

అలికిడైనను  చాలు అదరి బుస్సని లేచి పడగెత్తి పైబడు పాపరేళు/

అడుగు పెట్టిన చాలు ఒడలు జిల్లున లాగి నరముల కుదియించు నదుల నీళ్ళు /

గాలి దోలిన చాలు కదలి గీయని కర్ణ పుటములు వ్రేల్చెడి ముది వెదుల్లు /


పులులు సింహాలు శరభాలు పోవ పోవ /

కటిక చీఁకటి కనరాదు కాలి త్రోవ /

మరలి పొమ్మిక విడువుము మగని యాశ /

మాట వినవేల  బేల మరల వేల.


పోవేల పొమ్మికన్ పో పో పోవేల పొమ్మికన్ 

నా వెంట రాతగదు రావలదు "" 

పోపోవేల పొమ్మికన్ 



చీమలుదూరని చిట్టడగులలో 

కాకులు దూరని కారడగులలో 

లబో దిబో మని అఘోరించిన

ఫలితము సున్న  మరల మెదలక  పో వేల పొమ్మికన్ 




పోగు చున్నావా 


అహా ఏమి  బాల అచంచల మనస్థైర్యము 

దుర్గమ కీకారణ్య సీమల నధిగమించుటయే కాక

మహోన్నత పర్వత శిఖరాగ్ర ముల సైతమధిరోహించి నన్నసరించుచున్నదే


మరియును  కొంచెం బెదరించి చూచెదను గాక 


చెప్పిన వినవు చెముడ దిముడా పట్టిన పంతము విడువవు గా 

ఏమనుకుంటివి ఎవరనుకొంటివి 

శముండను పాశ ధరుండను కాల యముండను 


అహో ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమా

బేలా , సావిత్రి ఇక మానవ మాత్రులు దాటలేని బాట యిది


గోదాన పుణ్య భాగ్య వంతులకు తప్ప యన్యులకలంఘనీయమైన వైతరణి యల్లది 


సా:-అన్నియును తెలిసిన ధర్మవేదులు .

ఇంత దూరమేతెంచి 

రిక్త హస్తములతో తిరిగి  పొమ్మందురా?



:- మరి యేమందును .


ఇదియును నిక్కంబ 

కనికరించి ఏదైన ఒక్కండు వరంబొసంగి పంపెదను 

సాధ్వి ! నీ కార్య దీక్షకు కడుంగడు సంతసించితిని

 నీ పతి ప్రాణమ్హు దక్క ఏదైన మరొక్క వరంబు కోరుకొనుము 


సా:-  యముని కర్కశ హృదయంబు కూడ కరుగుచున్నదే

ఇచ్చినయవకాశమేల జారవిడువ వలె 


స్త్రీలకు పుట్టినిల్లుకంటె మెట్టినిల్లే ప్రధానమని కదా యార్యోక్తి 


యమధర్మరాజా


రాజ్యభ్రష్టులై అడవులందు కటకటంబడు యత్తమామలకు ..


:- రాజ్య ప్రాప్తియు నేత్ర దృష్టియు రెండును ఒసంగితిని పొమ్ము 


వదలక వచ్చుచున్నదే 

అయినను ఇటువంటి వరములెన్ని యిచ్చినను మా యమ ధర్మమునకు భంగము వాటిల్లదు కదా కనుక మరొక్కవరంబొసంగి లాలించి బుజ్జగించి యూరడించి మరల్చెద 

సావిత్రి 

అబలవన్న యాదరంబున నొంటి వరంబొసంగి పంపుట పాడికాదని భావంబున మరొక్క వరంబీయ నిచ్చగించితిని.అదియును నీ పతి ప్రాణంబు దక్క 


సా:- ఇప్పుడు దారిని పడినాడు .  అవకాశమునేల పోనీయవలె .


సమవర్తి . అపుత్రస్య గతిర్నాస్తి యని యలమటించు  మా తల్లి దండ్రులకు  ...


 :- యిఁక చాలు బాబోయ్ యన్నట్లు సుత శతంబనుగ్రహించితిని.


సంతుష్టవై మరలుము 



సా:- ఒకటి నే గోరితి రెండు నీవిచ్చితి , , ముచ్చటగా మూడవ కోరిక చెల్లించక పోవుట పాడియే ధర్మమూర్తి


ఇది మా ధర్మ స్మృతిలో యున్నట్టు లేదే .అయినను ఆఖరి కోరికయని వాపోవుచున్నది . ఇచ్చి పంపెదను .

సావిత్రీ అడుగుము . అదియును నీ పతి ప్రాణము దక్క . 


సా:- 

సంతానమును జూచియైనా సంతసించు భాగ్యమును ప్రసాదించుము .

ప్రసాదించి పొమ్ము


యింక్కెడికి పోయెదవు

నా పతి ప్రాణములనీయక యడుగు వేయలేవు


:- ఏమీ యడుగు వేయలేనా


 మహిష రాజమా 


ఏమాశ్చర్యము ! దేవాసుర గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులెత్తి వచ్చిననువిలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నను నెమరాపక అడుగు తప్పక తల త్రిప్పక ముందుకు నడచి పోవు నామహిష రాజము నేడేలకో తత్తర  పాటున బిత్తర పోవుచున్నది


నీవు సాధ్వి  యని యనుకొంటిని , ఇంద్రజాలినివి కూడా 


సా:- 

ఇది ఇంద్ర జాలము కాదు .ధర్మ బద్ధమే 


:- 

ధర్మ బద్ధమా ? నాకు తెలియని ధర్మమా

యమ ధర్మమునకు పైన మరొక్క ధర్మమా ? ఎటుల ? 



గీ

అమరులెటులైన సంతానమందవచ్చు 

మనుజ లోకాన సాధ్వి కి మగడు లేక

పుత్ర సంతా  మేరీతి పొందగలరు 

తమకుతెలియని ధర్మమే ధర్మ రాజ ! 


అహా పతివ్రతా శిరోమణి యను వాత్సల్యమున వచ్చియుంటిని కాని 

ఇంతటి తెలివిగలదని తెలిసి యుండిన నేను రాక నా భటులనే పంపియుందునుగతంబునకు వగచిప్రయోజనంబేమి ? కనుక 


సాధ్వి సావిత్రీ 

నీ పతి భక్తికి సమయస్పూర్తికి కడుంగడు సంతసించితిని . ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహింపుము . యమునంతటివానినే తికమక పెట్టి గెలువజాలిన నీ చరిత చరితార్థము . పతితో చిరకాలము ఇహ సౌఖ్యములనుభవించిఅనంతరంబు నాలోకంబున కాదు కాదు స్వర్గ  లోకంబున జేరి తరింతురు గాక.తరింత్రు గాక తరింత్రుగాక 










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి