వాల్మీకి రామాయణము లో సుమిత్ర సహృదయతను తెలిపే శ్లోకము.
అయోధ్య కాండ /40 వ సర్గ /9
శ్లో.
రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్I
అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత యథాసుఖమ్৷৷
మొదటి అర్ధం:
రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా
లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో, సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!
తే.
తలచు రాముని నీ యొక్క తండ్రి గాను /
తలచు సీతను నావంటి తల్లి గాను /
తలచు మా విపినము నయోధ్యా నగరము /
వోలె లక్ష్మణా ! వని చను మోయి హాయి . ( కోమలరావు )
క.
అన్నా నీవనయము రా
మన్నను నాన్న వలెనన్ను మైథిలి కాగన్
ఎన్నుము నీమదిలో ల
క్ష్మన్నా యెన్నుము విపినము సాకేతముగన్ ( కోమలరావు )
క.
అన్నా ! నీవనయము రా /
మన్నను తండ్రి వలె సీత మామక రీతిన్
చెన్నుగ విపినమయోధ్యగ
నెన్నుము తనయా ! సుఖముగ నీవు చను మింకన్
అనయము = ఎల్లప్పుడు.
విపినము = అడవి .
సాకేతము = అయోధ్యా నగరము