తేటగీతి మాలిక
భూమి భారంబు తగ్గించ పుడమి వేఁడ /
వసుధ కోర్కెకు దివ్యులు వంత పాడ /
దనుజుల దునుమాడుటకునై దానవారి /
దేవకీ దేవులకు పుట్టె తేజమలర /
కంసు భయముచే నిశరాత్రి కరుణతోడ /
తండ్రి బాలుని వ్రేపల్లె తరలజేసె /
బాలుడంత పెరుగుచుండె వ్రజమునందు /
తల్లియై యశోద శిశువుఁ దనుపుచుండ /
పిన్న వయసున పూతన పీచ మడఁచె /
పెక్కు దనుజుల బాలుడై యుక్కడంచె /
మన్ను తిన నోరు చూపించుమన్న చూపె /
తల్లికి పదునాల్గు జగము లెల్ల నోట /
మద్దులను గూల్చె , కాళియు మదమడంచె /
కొండనెత్తి యాఖండలు క్రొవ్వడంచె /
విశ్వగురుడైన గురునొద్ద విద్యనేర్చె /
మామకంసుని సమయించి మహిమ జూపె /
గొల్ల భామల మురిపించె పల్లెలోన /
ద్రౌపదికివలువ లొసఁగి రక్షచేసె /
ధర్మమునిలుప పార్థు రథమ్ము నడపె /
'గీత' నుడివె జనులతల వ్రాత మార్చ /
ధరను దుష్టుల శిక్షించ తాను పుట్టె /
అట్టి కృష్ణునకనిశము నంజలింతు .
డా.కోమలరావు బారువ