లత-వనిత-కవిత
క.
ఆలంబన కావలె నా /
పూలతకు తగఁ బతి యె ఊత పూఁబోడి కిలన్/
మేలగు కవితకు కావలె /
నేలిక సరసంపు ప్రాపు యెప్పటికైనన్ .
డా. కోమలరావు బారువ 5/12/2022
లత-వనిత-కవిత
క.
ఆలంబన కావలె నా /
పూలతకు తగఁ బతి యె ఊత పూఁబోడి కిలన్/
మేలగు కవితకు కావలె /
నేలిక సరసంపు ప్రాపు యెప్పటికైనన్ .
డా. కోమలరావు బారువ 5/12/2022
స్వీయ రచన
ఆ. వె
సమయ మున్న వేళ సంపదలేదాయె /
సంపద కలుగంగ సమయలేమి /
సమయ సంపదలును చాలినంతయునున్న/
అనుభవించ శక్తి అసలు లేదు .
ఆ.వె
అప్పు లేని వాడె యందరి కంటెనై
శ్వర్య వంతుడవని బరికిఁపంగ
అప్పు చేయు మనిషి అప్పులలో మున్గు
నవని లోన కాన నరసి బ్రతుకు
అప్పు = ఋణము , నీరు
-డా. కోమలరావు
డా. కోమలరావు బారువ .21/11/2022
రైతు -బుగత
భూమిని నమ్మిన రైతు అందరికి కూడు పెడుతున్నాడు.
భూమిని అమ్మిన బుగత అందరి నోట్లో మట్టి కొడుతున్నాడు .
భూమిని నమ్మి (దున్ని) చెమట చిందిస్తున్నాడు రైతు
భూమిని అమ్మి కాసులు చేసుకుంటున్నాడు బుగత.
బుగత మేడలు మీఁద మేడలు కడుతున్నాడు .
రైతు పాడె మీఁదకి వెళుతున్నాడు.
రైతుకు ఎరువులిచ్చేందుకు బ్యాంకులో సొమ్ములు కరువు.
బుగతకు అరువులిచ్చేందుకు ( loans ) బ్యాంకులు పరుగు పరుగు .
రైతుకు లోనివ్వాలంటే సవాలక్ష క్వరీసు .
బుగతకు లోనివ్వాలంటే లేవే ఎన్క్వరీసు .
రైతు దృష్టి ప్రజల కడుపు నింపడం పైన .
బుగత దృష్టి ప్రజల కడుపులు కొట్టడం పైన .
ఇన్ని చేసిన రైతుకు తిరస్కారము .
అన్ని దోచిన బుగతకు పురస్కారము .
-కోమలరావు
ఆ .
ముప్పదేండ్లు గడచె గొప్పగు ప్రాక్టీసు
చేసి , కీళ్ళు సడలె చేతి వేళ్ళు
వణకె ;భక్తి కలిగి ( ధర్మ మెరిగి ) బ్రతుక వలె మనము
చింత లేక శేష జీవితంబు
14/11/2022
ముప్పదేండ్లు గడచె గొప్పగు ప్రాక్టీసు
చేసి , కీళ్ళు సడలె చేతి వేళ్ళు
వణకె ; సమయమయ్యెను రహి భక్తి
కలిగి జీవితంబు గడప వలెను
14/11/2022
దైవ సృష్టి.
క.
ఉప్పును సృజించితివి నీ/
వప్పుల , సహకార తరువు నవనిన్ గరిమన్
గొప్పగ రెంటిని తగ నే /
ర్పొప్పన్ గల్పితివి నిన్ను పొగడన్ తరమే.
-కోమలరావు
తెలుగు భాష
తే.
ఇంచు రసమును రుచిలోన మించుభాష /
పాల కన్నను తెల్లని స్వచ్ఛ భాష /
పశ్చిమాదులు మెచ్చిన ప్రాచ్య భాష /
రాయలు పొగడిన తెలుగు రమ్య భాష .
డా. కోమలరావు
ఇంచు = చెఱకు
దాశరథి కి నివాళి
కవిత్వ సంపదకు శరథి
గభీరతకు మహోదధి దాశరథి
తెలంగాణ గడ్డపై పుట్టిన ధీమణి
నిరంకుశ పాలనకు ఎక్కుపెట్టిన గుణి
ఆంధ్ర దేశ ఆస్థాన పీఠి నలంకరించినవాఁడు
అలనాటి చిత్రసీమను పాటలతో నలరించినవాఁడు .
నైజాము పాలకుల తూర్పార పట్టిన ' అగ్నిధార'
బడుగు పేదల వెతల కతల వాణి 'రుద్రవీణ'
కవితలెన్నొ వ్రాసి. ఘనత కెక్కినఘనుఁడు
బిరుదులెన్నొ గొన్న ' కవిసింహము '
రచన లెన్నొచేసి రాణ కెక్కిన కళారవి
మన దాశరథి కృష్ణమాచార్య సుకవి .
డా కోమలరావు
తరువులు
తేటగీతి మాలిక
అరయ తరువులు పక్షుల కాశ్రయంబు /
మానవాళికి నిచ్చు ను మంచి గాలి /
పథిక మార్గ శ్రమము నెంతొ బాపు తరువు /
ఫలములిచ్చి మనుషుల యాకలిని తీర్చు /
తరువులెండిన యగు వంట చెఱకు మనకు /
ఇలను దున్నఁగ ఘన మగు హలము కాదె /
తరువు పాడెయౌ మనుషుల మరణ వేళ /
కాయములు కాల్చఁగ రహి కట్టె యగును /
తరువులీ భువి కెంతయు బరువులౌనె /
తరువులను పెంచ వలె మన తనయు లట్లు .
డా. కోమలరావు బారువ 3/11/2022
నాగుల చవితి సందర్భముగా మహాభారతము ఆది పర్వమునుండిఉదంకుడు చేసిన నాగుల స్తుతి .
చ.
బహువనపాదపాబ్ధి కులపర్వతపూర్ణ సరస్సరస్వతీ /
సహిత మహామహీభర మజస్రసహస్ర ఫణాళిఁ దాల్చిదు/
స్సహతర మూర్తికిన్ జలధిశాయికిఁ బాయక,శయ్యయైన య/
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్.
తా .
పెక్కు అడవులతో , చెట్లతో సముద్రాలతో ,కులపర్వతాలతో నీటితో నిండిన సరస్సులతో , నదులతో కూడిన భూమియొక్క. బరువును ఎల్లప్పుడు వేయిపడగల సముదాయముతో ధరించి మిక్కిలి సహింపశక్యము కాని విగ్రహము,గలనారాయణునికి విడువక తల్పముగాఉండి పాపాల అంతరింపజేసి అనంతుడనే పేరు గల ఆ నాగరాజుమా పట్లఅనుగ్రహము,కలవాడు అగుగాక .
చ.
అరిది తపోవిభూతినమరారుల బాధలువొందకుండఁగా/
నురగుల నెల్లఁగాచిన మహోరగనాయకుఁడానమత్సురా/
సురమకుటాగ్రరత్న రుచిశోభిత పాదునకద్రినందనే/
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్..
తా.
చేయ శక్యముగాని తపస్సుయొక్కవైభవముచేత రాక్షసులు పెట్టే బాధలు పొందకుండగా నాగులనందరినిరక్షంచినగొప్పసర్పరాజును , వంగి నమస్కరించే దేవతలయొక్క రాక్షసులయొక్కయు కిరీటాలపై భాగాలనున్నమణులకాంతిచేత ప్రకాశించే పాదాలు కలపార్వతీపతియైన శివుడికి అలంకారమైన వాసుకి,అనే సర్పరాజుమాయెడ అనుగ్రహము కలవాడు అగుగాక .
ఉ.
దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్ విపులప్రతాపసం/
భావిత శక్తి శౌర్యులు నపార విషోత్కట కోపవిస్ఫుర /
త్పావకతాపితాఖిల విపక్షులు నైన మహాభావు లై/
రావతకోటి ఘోరఫణి రాజులు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
తా.
దేవతల మనుష్యుల లోకాలలో తిరుగుతూ అధికమైన తేజస్సుచేత పూజింపబడిన సామర్థ్యము , పరాక్రమముకలవారును ,అనంత,విషముచేతమధికమైన కోపముతో ప్రకాశించే అగ్ని చేత తపింపజేయబడిన సర్వ శత్రువులుకలవారును అయిన మహాత్ములు ఐరావత నాగవంశములోని కోటి సంఖ్యాకులైన సర్పరాజులు మాపట్ల అనుగ్రహముకలవారు అగుదురుగాక.
ఉ.
గోత్రమహామహీధర నికుంజములన్ విపినంబులం గురు/
క్షేత్రనం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుఁడై/
ధాత్రిఁ బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షుఁడీక్షణ/
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
తా.
గొప్ప కులపర్వతాల పొదరిళ్ళలో అడవులలో కురుక్షేత్రములలో ఇచ్ఛవచ్చినట్లు సంచరించే క్రీడతో అలరి కుమారుడైనఅశ్వసేనుడితో కూడి భూమి మీఁద తిరుగుతూ బలములో గర్వములో శౌర్యములో సమర్థుడైన పరాక్రమవంతుడుపాములకు రాజు అయిన తక్షకుడు మాయెడ అనుగ్రహము కలవాడు అగుగాక.