18, నవంబర్ 2019, సోమవారం





మన కవులు .


వ్యాసుడు.


వ్యాసుడు 


.వె 


నాల్గు తలలు లేని నలినాసనుఁ డతఁడు 

రెండు భుజము లచ్యుతుండతండు /రెండు భుజములుగల శ్రీ ధరుండు 

అగ్గి కన్నులేని  అసమాంబకుడతఁడు 

వ్యాసుడై జగతిని వరలె నతఁడు 



తే.గీ 

పల్లె పడుచుకు పాపడై ప్రభవ మంది/
వేదములు నాల్గు వేర్వేర విశదపరచి /
భారత ఫల మందించిన బాదరాయ /
ణార్య చేకొను వేవేల నతులు మావి.

తే.గీ 

భావి కాలమునల్ప మతులు ప్రజలని మది/
తలఁచి భారతాఖ్యమఁ పటు కలము నొసఁగి /
పెక్కు బాముల తరియింప పెంపు మీర/
ప్రజల బ్రోచిన శుకతాత వ్యాస మౌని .


వాల్మీకి
ఆ.వె.
పుట్టలో న పుట్టె పుణ్యాత్ముడొక్కడు/
వామాలూరుడనఁగ వఱలు వాఁడు /
వాని నోటి నిండి వచ్చె రామచరిత్ర /
ధరణి జనుల ముక్తి దాయకంబు .



కాళిదాసు

ఆ.వె.

కవుల గణన చేయఁ గనిష్ట దాటని/
ఘనత కెక్కినట్టి కవివరుండు/
తివిరి ఉపమలెన్నొ తీపిగా కూర్చెడి/
ఘనుడు కాళిదాసు కాళిదాసు.

తే.గీ.

రమ్యమగు నాటకములెన్నొ రచన చేసి/
మేఘసందేశ , రఘు వంశ మేటి కావ్య/
మణులను జగతికిచ్చిన మాన్యు కాళి/
దాసు కాళికా దాసుని దండమిడుదు.


ఉపమా కాళిదాసస్య. భారవే అర్థ గౌరవః
దండినః పద లాలిత్యం మాఘే త్రయీ గుణాఁ


నన్నెచోడుడు.

తే.

దేశ కవితకు ఆద్యుఁడై నెగడు వాఁడు/
మార్గ కవితను రచనలో మరువకుండ /
క్రౌంచభేదను సంభవ కావ్య కర్త/
ఘనుఁడు నన్నెచోడకవిని వినుతి సేతు.

నన్నయ కవి

తే.

రాజ రాజయశము సుస్థిర మ్ము చేయ/
రమ్యముగ భారతమ్మును రచన చేసి/
ఆది కవియనఁ తెల్గున నలరు వాని/
నన్నయ కవిని మనసార నతులు సేతు.


తిక్కన కవి

తే.

మనుమ సిద్ధి యెవని మామ యనియెఁ బేర్మి /
భారతమెవని కలములో పరిడవిల్లె/
రామ కథ నెవడు రహిఁ నిర్వచన చేసె/
నట్టి తిక్క యజ్వను నెమ్మనమునఁ దలఁతు.


ఎఱ్ఱన కవి

తే.

రాణకెక్కఁగ హరివంశ రచన చేసి/
భారతారణ్య శేషము భక్తి వ్రాసి/
శంభు దాసు బిరుదు గొనె శంభుఁ గొలిచి/
ఎఱ్ఱనార్యుఁడు భువినెంత వినుత యశుఁడు.

శ్రీకృష్ణ దేవరాయలు.

తే.గీ
తుళువ వంశ కల్ప కుజమై కలన మెఱసి/ కన్నడ తెనుఁగు రాజ్యశిఖరపు భూష / ణ ,పర రాజ నిర్మథన ఘన భుజ వీర్యు/ కృష్ణ దేవ రాయ నృపుని కీర్తి మెత్తు.తే.గీ కలము చేపట్టి కృతికన్యకలసృ జించి/ కత్తి కేలూని సంగర కల్పన లను/ కృతి కదనములను ఘనుడు కృష్ణరాయ/ లనుచు రాయల సత్కీర్తు లనునుతింతు.

చేమకూర వేంకట కవి

తే.

మధుర నాయక రాజుల మన్ననంది /
అలఁతి పదముల మధుర కృతులన లరఁగ/
రచన చేసిన యట్టి సరస కవి మణి/
చేమకూర వేంకట కవి చిర యశుండు.

తే.

వైద్యుడైన గాని వర్ణింపగాలేని/
గర్భ లక్షణాలు గరువమొప్ప/
చేమకూర వారి చెన్ను మీఱేడు కైత/
రసిక జనులహృదయ రంజకమ్ము.


అయ్యలరాజు రామభద్రుడు.

తే.
రాయల భువన విజయాన రాణ కెక్కి/
రహిని రామాభ్యుదయ కృతి రచన చేసి/
నట్టి రామభద్ర సుకవిఁ నిట్టలముగ/
నామతింతును నామది నేమముగను


సూరన కవి

తే.

కావ్యమందొక యర్థము గనుట లెస్స/
పరఁగ రెండర్థముల కృతులరుదు గాదె/
రామభారతార్థయుతమ్ముగా మలచిన /
కవిని సూరనార్యు మదిని గణన సేతు.


నంది తిమ్మన

తే.

సత్య పుష్పముఁ గోఁరఁగాఁ శౌరి తెచ్చె/
పారిజాతమున్ మక్కువ మీఱ భువికి/
సరసులు భళీ యనఁగఁ రచనను చేసెఁ/
నరణపుఁ గవి తత్పుష్పాప హరణ కథను.


బద్దెన

పెద్దనవలె జిగి బిగియౌ/
పద్దియముల వ్రాయవలెను పండితులన్నన్/
బద్దెన వలె నీతిఁ దెలుపు /
పద్దియములు వ్రాయ వలెను పండితులైనన్.

తిరుపతి కవులు

తే.

అరయఁ నవధాన విద్యకుఁ నాది కవులు/
మీసలపయిఁ బందెమ్మేసె మేటి కవులు /
రాయబారాది నాటకాల్ రచన చేసి /
నట్టి జంట కవివరుల నామతింతు.

కొప్పరపు కవులు

క.
గొప్ప కవితలాశువుగా /
నొప్పగు నవధానకళల నొరవడి దిద్దన్/
కొప్పరపు కవులు చెప్పె నొ/
కప్పుడు రాజుల కొలువుల నాదరమొప్పన్.

జాషువా

తే.

ప్రథిత గుంటూరు సీమలో ప్రభవ మంది/
దళిత కులమందు వెలసిన తులసి వీవ/
 రహిని గబ్బిలం పిరదౌసి రచన చేసి/
 గణన కెక్కిన జాషువా ఘనుడ వీవు.

డా. బారువ కోమలరావు .11/11/2019

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి