నా (హంస) భద్రగిరి యాత్ర
గీ.
రాము దర్శించఁగ వెడలు 'రామ'దండు /
తాము వ్రాసిన రామకథ వినిపింప /
వినుత సాంప్రతి గురువులు వెంట రాగ /
తల్లి గోదావరి దరి భద్రాద్రి గిరికి .
ఆ.వె
శుక్ర వార వేళ శోభాయమానమై /
'హంస' యాత్ర వెడలె హౌసు మీర /
రాణ్మ హేంద్ర పుర వరమ్ము చేర గురువు /
గారి పెట్టె కాస్త గాయబాయె .
వ.
అచటు వాసి మేము రెండు బస్సులలో నెక్కి గోదారి గట్టు మీఁద ఫలహారమారగించి , పోలవరము ప్రోజక్టు నానుకొని యున్న పడవనెక్కి సిరివాక చేరి కొండ నెక్కినాము సూర్యుడస్తాద్రికిఁ జేరు వేళ .
తే.గీ
అయ్యెడ సిరి వాక ను గుట్ట చయ్యనెక్కి /
టీ పకోడి ల సేవించి , టిప్పు టాపు /
గా నిలబడి ఫోటోలకు క్లాపు కొట్టి /
గడిపినాము చల్లని సంధ్య కాలమందు .
క.
చల్లని వెన్నెల రేయిలో
అల్ల కలువల చెలుని పయి నాలాపనముల్ /
ఉల్లము రంజిల పాడిరి
తల్లజులైన విదుషీమతల్లులు ప్రీతిన్ .
తే.గీ
ఆ నిశీధిని టెంటుల లోన గడిపి /
వేకువ జలక ముల్జేసి వెచ్చ నీట /
టీలు కాఫీలు సేవించి టిఫినులు తిని /
పడవ నెక్క భద్ర గిరికి పడవ సాగె
---------
పడవ నెక్కి భద్ర గిరికి పైనమయ్యె /
రెండవ రోజు
బస్సు లోన ఆ రాముని భజన చేసి /
భద్ర గిరిలోని సీతానివాసు చేరి /
అంబ సత్రాన ఆహార మారగించి /
మూఁడు గంటలకా స్వామి ముందు నిలిచి .
రామం భజే శ్యామలమ్
అ.వె
రామ భక్తి తోడ రసవత్తరమ్ముగా /
రచన చేసి నట్టి రామ కథను /
రామ పదకమలముల కడ నర్పణ చేసి /
రాము దయకు పాత్రు లైతిమేము .
ఆ.వె
తేటగీతులనెడి తీగ పూవులుతెచ్చి /
భద్ర గిరివెలసిన ప్రణుత రామ /
పాద పీఠి యందు పదిలపరచి నాడ /
రామ భద్రు నమిత ప్రేమ కోరి .
వ.
శ్రీ ధూళిపాళ మహదేవమణి వర్యులు "రామం భజే శ్యామలమ్" గ్రంధమును మేఘనినద మధుర స్వరమ్ముల ప్రస్తుతించ , శ్రీ సాంప్రతి సురేంద్రనాథ దేశీకోత్తముల వాత్సల్య భాషణ వన్నెకెక్కె. అటుపిమ్మట
శ్రీరాముని దర్శన భాగ్యమును కలిగించిన శ్రీ ముక్తేశ్వర రావు గారిని సముచిత రీతిని గారవించి, ముఖ్య అతిథి శ్రీ ధూళిపాల మహదేవమణి
గారిని శ్రీ సాంప్రతి వారిని సత్కరించి , ఈ హంస యాత్రకు సహాయ సహకారములనొసంగిన శ్రీ విద్యాసాగర్ , శ్రీ రాథేశ్యాం మరియు శ్రీ శాస్త్రి గారిని యథా శక్తి గౌరవించిన పిమ్మట అంబ సత్రమున ఫలహారమారగించ రెండవరోజు శుభప్రదమ్ముగ గడచిపోయె .
మూఁడవ రోజు .
స్వామి కళ్యాణ మొనరించు వారు , పర్ణ /
శాల చూడ నేగెడి వారు చనిరి వేగ /
కుతప సమయాన సత్రాన కుడిచి , మరల
స్వామి వారి సన్నిధికినై చనితి మేము
వ.
శ్రీమతి సుధారాణి మరియు వారి శిష్య బృందము వీనుల విందుగా శ్రీరామ కీర్తనలనాలపింప , పద్య సౌందర్య సభ్యుల బాల కాండమునందలి పద్య పఠన జరుగ , శ్రీ ఆదిత్య గారిచే భక్త రామదాసు నృత్య హేళి తో మూఁడవ రోజు కార్యక్రమము సంపూర్ణమయ్యె .
తే .
'రామ'కరుణ వలన రాముని దర్శించి/
ప్రేమ నక్షరముల రాము పొగడి /
చేరినాము మేము శ్రీకాకుళమ్మును /
హంస యాత్ర సాగె హ్లాద మెసఁగ /
స్వస్తి
భవదీయుడు
డా. కోమలరావు బారువ