7, డిసెంబర్ 2021, మంగళవారం

 


ఘంటసాల సినిమాసంగీత  ప్రస్థానమును పద్య ఖండ కావ్యముగా శ్రీతిరుమల శ్రీనివాసాచారి గారు రచన చేసినారు . దానినుండి శ్రీ శరత్ చంద్రగారు స్వరపరచిన సీస పద్యమును నాకు చేతనైన రీతిలో పాడినది .



రచన:- తిరుమల శ్రీనివాసాచారి.

స్వరకల్పన :- శరత్ చంద్ర .


సీ

పరవశింపగజేసె 'పాతాళ భైరవి' 'పెళ్లి చేసి చూడుప్రీతి  నింపె /

ఒక 'చిరంజీవులుయుయ్యాలలూగించె 'దీపావళి  'యె దివ్య దీప్తి  నింపె /

'గుండమ్మ కథ'గుండె నిండుగా సుధ పోసె 'భువనసుందరి కథ'పూలు కురిసె/

మనసును కదలించె 'మాయాబజారు'యిక 'లవకుశసంగీత లాస్య మాయె //


గీ

అబ్బురము గొల్పినది 'రహస్యముస్తుతింప /

ఘంటసాల సంగీత వికాస దివ్య /

విశ్వ సౌందర్య సౌభాగ్య విమల లలిత /

దర్పణములవి సంగీత దర్శకులకు 



సీ 

*రాగేశ్వరిని  గూర్చి *భాగేశ్వరిని దీర్చి గానామృతము బంచె ఘంటసాల /

*కామవర్ధిని *తోడి , *కాంభోజి రాగాల గళమెత్తి పాడెను ఘంటసాల /

*ఆరభి  *జోగియా *హంస నాదములందు నాలపించెను *గీత హ్లాదమొదవ/

*చారుకేశి *వసంత * చంద్రకౌన్సుల యందు శ్లోక గానము చేసి సుఖము గూర్చె.


*మలయ మారుతమ్మును పాడి మనసు దోచె/

రంజనము గూర్చె లే *శివరంజని శ్రుతి/

*మోహన ను పాడి యెదల సమ్మోహపరచె/

అవని సుఖియింప బాడె *కల్యాణి యందు .


సీ 

తలనిండ పూదండ దాల్చి వచ్చును  రాణి కల్యాణి రాగాన గళము నెత్త /

ఆనందమర్ణమైనట్టులగపించు మధుర వాణి యె నృత్య మధువు చిలుక /

మౌనము గానున్న మానస  వీణ మ్రోగినయటులుండు మోహనను పాడ /

వేషము మార్చిన భాషను నేర్చిన ననబోడిని వలచు మోహనను పాడ//


గీ

ఎంత హాయిని నింపెనో యెదలయందు /

ఘంటసాల  మోహనమున గళమునెత్త /

చెంగు చెంగున దూకెలే చిలిపి తలపు /

వాణి కనువైన అందాల బాణి కూర్ప 


సీ

అతడు భీంప్లాసులో  ఆలపించిన భలే మంచి రోజని జనులెంచినారు /

ఆతడభేరి లో హాయిగా పాడగా అందమే ఆనందమై హసించె /

శృతి చూచి మధ్యమా వతి నాలపింపగా  మల్లియలెల్లను  మాలికాయె /

సింధు భైరవిలోన చిలికింప రాగమ్ము సన్నగా వీచెను చల్లగాలి //


వాణి ప్రస్తుతించుచు సరస్వతిని పాడి /

ఇందిరను గొల్చె శ్రీరాగమందు పాడి /

లలిత రాగాన కీర్తించె లలిత నతఁడు/

గాన సాహిత్య మణిమాల ఘంటసాల .






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి