18, డిసెంబర్ 2021, శనివారం

  చలికాలము - స్వెట్టర్



.వె 

శీత   కాలమందు చెలియ కౌగిలికన్న /

రింగు లీనెడు   సిగ రెట్టు కన్న /

తెల్ల వారి త్రాగు తేనీటికన్న ను /

వెచ్చ నైన దూలు  'స్వెట్టరేలె .


వెచ్చ గుంచు నూలు స్వెట్టరే లె 

14, డిసెంబర్ 2021, మంగళవారం

 భగవద్గీత భరత జాతికి మాత 

గీతా బోధకుండీ జగతికి పిత 

భగవద్గీత జనులకు మార్గ ప్రదాత 

గీతా పఠనము జీవికి త్రాత 




భగవద్గీత 


.వె 


ధర్మ యుద్ధ మందు ధర నుద్భవించెను / 

మార్గ శీర్ష పాఢ్య  మాది యందు /

కృష్ణ గీత యనగ  కృష్ణు  గళము నుండి /

పుడమి జనుల కెల్ల మోక్ష దాత /

వ్యాస కృపను సంజ ఉవాచగా వెల్గె /

నేక దశమి నాఁడు  కృష్ణ బోధ . 

-------


కురుక్షేత్ర సంగ్రామము మార్గశీర్ష మాసము పాఢ్యమి నాడు మొదలైనది యుద్ధాదిలో పరమాత్మ శ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునకు గీతోపదేశము చేసినాఁడుఅది ఏకాదశి నాఁడు అనగా భీష్ముని పతనానంతరము సంజయుని నోట ప్రపంచానికివెల్లడైనదిఅందుకే మార్గ శీర్ష ఏకాదశినాఁడు భగవద్గీత జయంతి జరుపుకొనుట



గీతా సారము 

ఆత్మ నిత్యమనియె నర్జున సచివుఁడు /

కర్మ చేయు ( వలయు ) ; వలదు కర్మ ఫలము /

మోజు పడకు పొరుగు పోకడలను చూచి /

శౌరి నుడివినట్టి  సార మిదియె .


కృష్ణ గీత 

.వె

మనిషి యెటుల భువిని మనఁగ వలయునట్టి /

బోధ చేసి మనకు ముక్తి నొసఁగు /

భక్తి కర్మ యోగ భాష్య సారాంశ మే /

 కృష్ణ దేవు యొక్క గీత యనఁగ .


డాకోమలరావు బారువ 22/5/2022


కవిత్రయము 


తే.గీ 


నన్నయ కవికి గీర్వాణ మన్న ప్రీతి/

ఎన్న తిక్కయజ్వకు తెలుగన్న ప్రేమ /

పరగ నెఱ్ఱనార్యుకు రెండు భాష లన్న 

దీపి , ముగ్గురుఁ దెలుఁగున దీప శిఖలు .


డాకోమలరావు బారువ



Attachment.png

11, డిసెంబర్ 2021, శనివారం

 తేగీ 


భరత మాతకు  బిడ్డలు బిరుదు మగలు /

విపిన రావతా ది ప్రభృతుల్ ; వీర మరణ /

మొందినట్టి  సాహస  వీరులందరికిని /

అశ్రు నయనాలతో  నే నంజలింతు .

7, డిసెంబర్ 2021, మంగళవారం

 


ఘంటసాల సినిమాసంగీత  ప్రస్థానమును పద్య ఖండ కావ్యముగా శ్రీతిరుమల శ్రీనివాసాచారి గారు రచన చేసినారు . దానినుండి శ్రీ శరత్ చంద్రగారు స్వరపరచిన సీస పద్యమును నాకు చేతనైన రీతిలో పాడినది .



రచన:- తిరుమల శ్రీనివాసాచారి.

స్వరకల్పన :- శరత్ చంద్ర .


సీ

పరవశింపగజేసె 'పాతాళ భైరవి' 'పెళ్లి చేసి చూడుప్రీతి  నింపె /

ఒక 'చిరంజీవులుయుయ్యాలలూగించె 'దీపావళి  'యె దివ్య దీప్తి  నింపె /

'గుండమ్మ కథ'గుండె నిండుగా సుధ పోసె 'భువనసుందరి కథ'పూలు కురిసె/

మనసును కదలించె 'మాయాబజారు'యిక 'లవకుశసంగీత లాస్య మాయె //


గీ

అబ్బురము గొల్పినది 'రహస్యముస్తుతింప /

ఘంటసాల సంగీత వికాస దివ్య /

విశ్వ సౌందర్య సౌభాగ్య విమల లలిత /

దర్పణములవి సంగీత దర్శకులకు 



సీ 

*రాగేశ్వరిని  గూర్చి *భాగేశ్వరిని దీర్చి గానామృతము బంచె ఘంటసాల /

*కామవర్ధిని *తోడి , *కాంభోజి రాగాల గళమెత్తి పాడెను ఘంటసాల /

*ఆరభి  *జోగియా *హంస నాదములందు నాలపించెను *గీత హ్లాదమొదవ/

*చారుకేశి *వసంత * చంద్రకౌన్సుల యందు శ్లోక గానము చేసి సుఖము గూర్చె.


*మలయ మారుతమ్మును పాడి మనసు దోచె/

రంజనము గూర్చె లే *శివరంజని శ్రుతి/

*మోహన ను పాడి యెదల సమ్మోహపరచె/

అవని సుఖియింప బాడె *కల్యాణి యందు .


సీ 

తలనిండ పూదండ దాల్చి వచ్చును  రాణి కల్యాణి రాగాన గళము నెత్త /

ఆనందమర్ణమైనట్టులగపించు మధుర వాణి యె నృత్య మధువు చిలుక /

మౌనము గానున్న మానస  వీణ మ్రోగినయటులుండు మోహనను పాడ /

వేషము మార్చిన భాషను నేర్చిన ననబోడిని వలచు మోహనను పాడ//


గీ

ఎంత హాయిని నింపెనో యెదలయందు /

ఘంటసాల  మోహనమున గళమునెత్త /

చెంగు చెంగున దూకెలే చిలిపి తలపు /

వాణి కనువైన అందాల బాణి కూర్ప 


సీ

అతడు భీంప్లాసులో  ఆలపించిన భలే మంచి రోజని జనులెంచినారు /

ఆతడభేరి లో హాయిగా పాడగా అందమే ఆనందమై హసించె /

శృతి చూచి మధ్యమా వతి నాలపింపగా  మల్లియలెల్లను  మాలికాయె /

సింధు భైరవిలోన చిలికింప రాగమ్ము సన్నగా వీచెను చల్లగాలి //


వాణి ప్రస్తుతించుచు సరస్వతిని పాడి /

ఇందిరను గొల్చె శ్రీరాగమందు పాడి /

లలిత రాగాన కీర్తించె లలిత నతఁడు/

గాన సాహిత్య మణిమాల ఘంటసాల .






30, నవంబర్ 2021, మంగళవారం

 గీత రచయిత సిరివెన్నెల ( చేంబోలుసీతారామ శాస్త్రికి అశ్రు నివాళి


.వె

తరలి పోయి నాఁడు  సిరివెన్నెలేడకో /

కలము చేత బూని కవిత లల్ల /

కవికి  యొక్క చోటు కాణాచి కాదులే /

కాన నిష్క్ర మించె తాను దివికి .


30/11/2021

26, నవంబర్ 2021, శుక్రవారం

 చాటువు - కొప్పరపు 

సరసిజ వైరి వైరులను చాలగు గెల్చు కుచద్వయంబుతో 

సరసిజ వైరి వైరి నగజానెడు మేలగు మధ్యమంబుతో 

సరసిజ వైరి వైరినెకసెక్కెములాడెడు కప్పు కొప్పుతో /

సరసిజ గంధి వచ్చె మరుసాయకమోయన సుబ్బయాహ్వయా .

15, నవంబర్ 2021, సోమవారం

 పుస్తకము 


పుస్తకము కాదు హస్త భూషణము 

పుస్తకము విజ్ఞానికి భోషాణము 

పుస్తకము విజ్ఞానార్ణవము 


పుస్తకము నీ మస్తకములో ఉంటే 

జగత్తు సమస్తము నీ వెంటే 


పుస్తకము తాటాకులకు మరో రూపము 

పుస్తకము సరస్వతీ దేవి  ప్రతి రూపము 


నిరతము పుస్తకము పఠించు 

నీ యొక్క  విజ్ఞాన్ని పెంచు 


పుస్తకము విద్యార్థికి  జ్యోతి 

పుస్తకము పెంచు మనిషి ఖ్యాతి 


డాకోమలరావు బారువ (ప్రాత రచన