ప్రపంచములో మనము అనేక రకముల పుష్పాలను చూస్తుంటాము.
వాటిలో పాటలి యొకటి. ఈ పాటల పుష్పములు పుష్పిస్తాయి . కాని ఫలములనీయవట .
సహకారము పుష్పించి ,మంచి ఫలములనిచ్చును.
పువ్వులుంటాయో ఉండవో తెలియదు కాని పనస మనకు మంచి రుచికరమైన పండ్లనిచ్చును.
అదే విధముగా మనుషులలో కూడ అనేక స్వభావాలు కల వారుంటారు.
కొందఱు ఉంటారు కాని ఎదుటి వాడికి ఉపయోగపడరు పాటల వలె.
మామిడి బాగా పుష్పించి మనకు మనకు ఫలములనిచ్చును. చెప్పినది చేసే కొందఱ వలె .
చెప్పకుండగనే ఎదుటి వాడికి మేలు చేసేవారుంటారు కొందఱు పనస వలె . పనసకు పువ్వులు ఉంటాయో లేదోతెలియదు కాని మనకు మంచి ఫలములనిచ్చును .
దీని గురించి ఒక పద్య సుమము .
ఆ.వె
ఫలము లివ్వలేదు పాటలి పుష్పించి /
సత్ఫలమ్ములను రసాల మిచ్చు /
పనస చెప్ప కుండ ఫలములె యిచ్చును /
పురుషులుంద్రు కొన్ని పువ్వు లట్లు .
దీనికి ప్రేరణ డా. దక్షిణామూర్తి గారు చెప్పిన కొన్ని చెట్ల స్వాభావ విశేషము .
వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు .
డా. కోమలరావు బారువ. 29/5/2022