వినాయక చవితి శుభాకాంక్షలతో స్వీయ రచన 22/8/2020
గణపతి ప్రార్థన.
గీత మాలిక
మేఘ వర్ణాభ నీలంపు మేని తోడ /
కేతుభా రావ భయదమౌ గీఁక తోడ /
తటిత సదృశ తళుకు దంతముల తోడ /
వర్ష ధార పగిది మద వారితోడ /
వృష్టి వేళనాఁ జను కరి వేల్పుఁ గొల్తు /
ననిశమునభీష్ట సిద్ధికి నార్తి తోడ.
( ననిశమున్ విఘ్న శాంతికి నార్తి తోడ )
*** నన్నె చోడుని పద్య భావన స్ఫూర్తితో ***
ఆభ =పోలిక , మేచక = నల్లని , కేతుభము = మేఘము , ఆరావము= ధ్వని, గర్జన , తటితు = మెఱుపు , గీఁక = ఘీంకారము , ( ఘీంకారము - ప్రకృతి , గీఁక వికృతి ), అనిశము = ఎల్లప్పుడు, నిత్యము .
భావము :-
మేఘము వలె నల్లని శరీముతో ,మేఘ గర్జనఁ బోలు ఘీంకారముతో , మెఱుపుల వంటి తళుకు మను దంతకాంతులతో, వర్ష ధారలాగ చెక్కిలి నుండి కారుతున్న మద జలము తో వర్షా కాలమువలెనున్న
ఏనుగు వేల్పును కోర్కెలు తీరుటకు నిత్యము ఆర్తితో కొలిచెదను .