8, ఫిబ్రవరి 2018, గురువారం

చెట్టు ఆవేదన     ( ముత్యాల సరాలు)

విత్తు నందున ఉండు దానను
సృష్టి ఆదిన బ్రహ్మ యట్లుగ
తపము చేసిన బ్రహ్మ యనంగ
ఆపము గ్రోలి పాదపము నై

చిన్ని యాకులాచ్ఛాదములు గ
చిన్ని సుమములె కలాపములుగ
పెరుగు చుందును పృథివి యిల్లుగ
ఫలము లిత్తును పుడమి జనులకు

అహము లందున మీరు వదలిన
గాలి పీలిచి నేను బ్రదుకుదు
నిశల యందున ఉసురు నిల్ప
మంచి గాలిని మీకు నిత్తును

చిన్న తనమున పలక నౌదును
పెరుగు వయసున పేప రౌదును
పొలము దున్నగ హలము నౌదును
బరువు మోయగ బండి నౌదును

మీరు ఉండగ గూడు నిత్తును
నిదాఘ వేళ నీడ నిత్తును
మీదు నిద్రకు మంచ మౌదును
అంత్య దశలో పాడె నౌదును

పరుల హితమును కోరు కొందును
వంట చెఱకై కాలి పోదును
యజ్ఞ మందున సమిథ నౌదును
చతుర్థములకు   మూలమౌదును


ఇన్ని చేసిన ఏమి కోరను
నన్ను పెంచి మీరు పెరుగుడు I
నన్ను కరుణతో మీరు బ్రోవుడు
భువిని మీరు శుభము బ్రతుకుడు