4, డిసెంబర్ 2025, గురువారం

 


దత్తుడు 


తే. 

అత్రి పుత్ర సంతానమై అధికమైన /

తపము చేయ త్రిమూర్తులాతనినియతికి /

సంత సించఁగ విష్ణునాంశమున పుట్టె /

దత్తుడార్తులయెడ వరదాయియగుచు .


తే. 

వేదములు శునకములయి వెంట తిరుగ /

మూడు శిరములతోడ  త్రిమూర్తి రూపు /

డైన ఉన్మత్త వేషుని  జ్ఞాన రూపు /

లోక గురుని దత్తునకేను  మ్రొక్కులిడుదు .


దత్త జయంతి సందర్భముగా అందరికి శుభాకాంక్షలు ..


4/12/2025

22, నవంబర్ 2025, శనివారం

 ఆ.వె

వంద యేండ్ల వయసు వైద్య కళాశాల /

ఎన్నొ వైద్య మణుల  కన్న తల్లి /

ఆంధ్ర వైద్య శాల అరుదైన కాలేజి /

వెజ్జు  విద్య యందు నొజ్జ బంతి . 


వెజ్జు = వైద్యుడు .

ఒజ్జబంతి =. ఒరవడి, మేలుబంతి, విద్యార్థులు చూసి రాయటానికై ఉపాధ్యాయుడు రాసే పంక్తి. (ముందు వరుసలో నుండుట ) 



శత 

సీస మాలిక 


సంజీవ నాముఁడు శవ శాస్త్ర మున దిట్ట , ప్రిన్సిపాల్ పదవిలో పేరుమోసె /


కందులాన్వయసోమ సుందరాచార్యుని పిజియాల్జి బోధనల్  వినఁగ నొప్పు /


పార్మకాలజి చెప్పె  పడతి యా నిర్మల తెలుగు సామెతలెంతొ తేజరిల్లె /


సర్జను పిచ్చయ్య స్వార్ధములేని యాచార్యుఁడు మునివోలె సజ్జనుండు /


వీరభద్ర వరుని వివరణాత్మక బోధ శస్త్ర చికిత్స లో  సానబెట్టె /


స్వారాజ్య లక్ష్మి సోషల్ ప్రివెంటివు శాస్త్ర బోధన మమ్మల్ని బుధుల జేసె /

.

*ఎన్ టియస్ *హెచ్చారు లెందరో వైద్యుల పాఠముల్ విని బుద్ధి పరిఢ విల్లె /


తే. గీ 



వారు నడయాడి నట్టి యీ వైద్య బోధ /

నా నిలయమిప్డు  వందేడ్లు రాణ మీర/

నిండినతరుణమందు నా  పండిత వరు /

లందర స్మరింతును త్రిశుద్ధి డెందమలర .

31, జులై 2025, గురువారం

 



నయనికకు శుభాశీస్సులు  27/7/2025


తేటగీతి 

బారువోద్యానవనములో పాదుకొన్న/

మహిత వల్లి మా చిన్నారి మనుమరాలు /

నయనికకు తాత నాన్నమ్మల ( అమ్మమ ల) యతులమగు /

దీవెనలివియె పుట్టిన దినము నాడు 


On the  eve of birthday of  grand daughter NAINIKA

who is born in the garden of Baruva

family wishing blessings on behalf of Grand parents

12, జూన్ 2025, గురువారం

 తే. గీ 

దేశ దేశాలు హాయిగా తిరుగనేగి /

అచట గలవింతలన్నియు నరసి యరసి 

మధుర మైనట్టి స్మృతులతో మరలివచ్చి 

నట్టి 'పల్లి'దంపతులకాహ్వానమిదియ .


కోమలరావు 

తే.గీ 

మనుమని గనఁగ నెమ్మనమున తలంచి /

అమెరికాదేశమునకు పయనమ'గలుజు '/

దంపతులకిద్దరకును మిత్ర సముదయము /

వేడుక లరంగ తెల్పెడు  వీడుకోలు


పయనమగు +అలుజు =  పయనమగలుజు 

23, మార్చి 2025, ఆదివారం

 సరదా గా ......


ఉపమా  కాళిదాసస్య

 భారవేరర్థ గౌరవం 

దండి పదలాలిత్యం 

మాఘే సంతి త్రయో గుణాః 


తే. 

కాళిదాసుఁడుపమలకు కాణ యాచి /

భారవి యను వాడర్థ సొబగునదిట్ట /

దండి లలిత పదములనుద్ధండుఁడు మహి/

మాఘుఁడరయంగ  మూఁడింట మహిమ చూపు 


డా. కోమలరావు