7, ఫిబ్రవరి 2024, బుధవారం

 నా (హంస) భద్రగిరి యాత్ర 


గీ. 

రాము  దర్శించఁగ వెడలు  'రామ'దండు /

తాము వ్రాసిన రామకథ వినిపింప /

వినుత సాంప్రతి గురువులు వెంట రాగ /

తల్లి గోదావరి దరి భద్రాద్రి గిరికి .


ఆ.వె 

శుక్ర వార వేళ శోభాయమానమై /

'హంస' యాత్ర వెడలె హౌసు మీర /

రాణ్మ హేంద్ర పుర వరమ్ము  చేర గురువు /

గారి పెట్టె కాస్త గాయబాయె .


వ. 

అచటు వాసి మేము రెండు బస్సులలో నెక్కి గోదారి గట్టు మీఁద ఫలహారమారగించి , పోలవరము ప్రోజక్టు నానుకొని యున్న పడవనెక్కి సిరివాక చేరి కొండ నెక్కినాము సూర్యుడస్తాద్రికిఁ జేరు వేళ .


తే.గీ 

అయ్యెడ సిరి వాక ను  గుట్ట చయ్యనెక్కి /

టీ పకోడి ల సేవించి , టిప్పు టాపు /

గా నిలబడి ఫోటోలకు క్లాపు కొట్టి /

గడిపినాము చల్లని సంధ్య  కాలమందు .


క. 

చల్లని వెన్నెల రేయిలో 

అల్ల కలువల చెలుని పయి నాలాపనముల్ /

ఉల్లము రంజిల పాడిరి 

తల్లజులైన విదుషీమతల్లులు ప్రీతిన్ .



తే.గీ 

ఆ నిశీధిని టెంటుల లోన గడిపి /

వేకువ జలక ముల్జేసి వెచ్చ నీట /

టీలు కాఫీలు సేవించి టిఫినులు తిని /

పడవ నెక్క భద్ర గిరికి పడవ సాగె 

---------

పడవ నెక్కి భద్ర గిరికి పైనమయ్యె /




రెండవ రోజు 


బస్సు లోన ఆ రాముని భజన చేసి /

భద్ర గిరిలోని సీతానివాసు చేరి /

అంబ సత్రాన ఆహార మారగించి /

మూఁడు గంటలకా స్వామి ముందు నిలిచి .


రామం భజే శ్యామలమ్


అ.వె 

రామ భక్తి తోడ రసవత్తరమ్ముగా /

రచన చేసి నట్టి రామ కథను /

రామ పదకమలముల కడ నర్పణ చేసి /

రాము దయకు పాత్రు లై తిమిలను .


ఆ.వె 

తేటగీతులనెడి తీగ పూవులుతెచ్చి /

భద్ర గిరివెలసిన ప్రణుత రామ /

పాద పీఠి  యందు పదిలపరచి నాడ /

రామ భద్రు నమిత ప్రేమ కోరి .


వ. 


శ్రీ ధూళిపాళ మహదేవమణి వర్యులు "రామం భజే శ్యామలమ్" గ్రంధమును మేఘనినద మధుర స్వరమ్ముల ప్రస్తుతించ , శ్రీ సాంప్రతి సురేంద్రనాథ దేశీకోత్తముల వాత్సల్య  భాషణ వన్నెకెక్కె. అటుపిమ్మట 

శ్రీరాముని దర్శన భాగ్యమును కలిగించిన శ్రీ ముక్తేశ్వర రావు గారిని సముచిత రీతిని గారవించి, ముఖ్య అతిథి శ్రీ ధూళిపాల మహదేవమణి

గారిని శ్రీ సాంప్రతి వారిని సత్కరించి , ఈ హంస యాత్రకు సహాయ  సహకారములనొసంగిన శ్రీ విద్యాసాగర్ , శ్రీ రాథేశ్యాం మరియు శ్రీ శాస్త్రి గారిని యథా శక్తి గౌరవించిన పిమ్మట అంబ సత్రమున ఫలహారమారగించ రెండవరోజు శుభప్రదమ్ముగ గడచిపోయె .



మూఁడవ రోజు .


స్వామి కళ్యాణ మొనరించు వారు , పర్ణ / 

శాల చూడ నేగెడి వారు చనిరి వేగ /

కుతప సమయాన  సత్రాన కుడిచి , మరల 

స్వామి వారి సన్నిధికినై  చనితి మేము 


వ. 


శ్రీమతి సుధారాణి మరియు వారి శిష్య బృందము వీనుల విందుగా  శ్రీరామ కీర్తనలనాలపింప , పద్య సౌందర్య సభ్యుల బాల కాండమునందలి పద్య పఠన జరుగ , శ్రీ ఆదిత్య గారిచే భక్త  రామదాసు నృత్య హేళి తో మూఁడవ రోజు కార్యక్రమము సంపూర్ణమయ్యె .


తే . 

'రామ'కరుణ వలన రాముని దర్శించి/

ప్రేమ నక్షరముల రాము పొగడి /

చేరినాము మేము శ్రీకాకుళమ్మును /

హంస యాత్ర సాగె హ్లాద మెసఁగ /


స్వస్తి 



భవదీయుడు 

డా. కోమలరావు బారువ